Saturday, May 1, 2010

తెలుగువారికి అందించబడిన మరో మహత్తర కానుక... సంపూర్ణ శ్రీ పాద శ్రీవల్లభ చరితామృతం.

తెలుగువారి అదృష్టం కొలదీ కలియుగములో శ్రీ దత్తాత్రేయుని ప్రధమ అవతార మూర్తి అయిన శ్రీ పాద శ్రీవల్లభుల వారు పిఠాపురంలో అవతరించారు. వీరి గురించి గురుచరిత్రములో తెలిపినది అతి తక్కువ మాత్రమే. వారి అవతార వైభవం గురించి, వారి మహిమల గురించి, వారి సమకాలీనుల గురించి తెలుగువారికి, ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. భక్తుల యొక్క కోరిక తీర్చడానికా అన్నట్లుగా భీమవరం నివాసి అయిన మల్లాది గోవింద దీక్షితులు అను వారి ఇంట ఈ మధ్యనే లభ్యమయినది. ఈ గ్రంధం గురించి రచయిత మాటల్లోనే చదువుదాము.

:శ్రీ పాదుల వారి దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్న బ్రాహ్మనుడు సంస్కృతంలో రచించినాడు. దాని తెలుగు అనువాదం బాపన్నావధానుల వారి 33వ తరం వాడినయిన నా వద్ద వున్నది. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతంలో బాపన్నావధానులు గారి 33వ తరంలోనే అది వెలుగులోనికి వస్తుందని చెప్పబడినది గాని అది ఏ సమయమున ఏ విధముగా అని వివరింపబడలేదు.

ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో నేను వెళుతుండగా ఒక వృద్దుడైన యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్ధించెను. నేను 11 రూపాయిలు ఇచ్చినాను. తరువాత రెండుమూడు రోజుల్లో గాణగాపురం నుంచి శ్రీ నృశిమ్హసరస్వతులవారి ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్టులో వచ్చినది. నేను ఏ రోజునయితే వృద్ద యాచకుడికి 11 రూపాయిలు ఇచ్చినానో అదే రోజున గాణగాపురానికి సంస్తానానికి నేను 11 రూపాయిలు ఇచ్చినట్లు రశీదు కూడా అందులో జతచేయబడినది. వాస్తవమునకు నేను గాణగాపురానికి ఎంతమాత్రం డబ్బు పంపించలేదు.

శ్రీ పాదుని సంకల్పం "చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయు సమయం ఆసన్నమైనదని" నేను గ్రహించి, ముట్టుకుంటే చిరిగిపోయేలా వున్న పాత ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి, తెలుగు పాత ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడ వెళ్ళి కృష్ణా నదిలో నిమజ్జనం చేసితిని."

"ఇది అక్షర సత్యమయిన గ్రంధం. దీనిలో వ్రాయబడిన ప్రతీ అక్షరమూ శక్తివంతమయినది. సత్యమయినది. ఈ గ్రంధంలో అతిశయోక్తులు గాని, అర్ధం పర్ధం లేని వర్ణనలు గాని వుండవు."

ఇంతటి మహిమాన్వితమయిన ఈ గ్రంధ రాజాన్ని తాడేపల్లిగూడెంలో వున్న శ్రీ దత్త విశ్వరూప సమితి వారు భక్తులకి అతి తక్కువ ధరకు అందచేస్తున్నారు. ఈ పుస్తకం కావలసిన వారు పూర్తి వివరాల కొరకు 9848499411 నెంబరుకు సంప్రదించవచ్చును. లేదా sreedattasamiti@gmail.com అను ఈమెయిల్ చిరునామాకు సంప్రదించవచ్చును.