Saturday, May 1, 2010

తెలుగువారికి అందించబడిన మరో మహత్తర కానుక... సంపూర్ణ శ్రీ పాద శ్రీవల్లభ చరితామృతం.

తెలుగువారి అదృష్టం కొలదీ కలియుగములో శ్రీ దత్తాత్రేయుని ప్రధమ అవతార మూర్తి అయిన శ్రీ పాద శ్రీవల్లభుల వారు పిఠాపురంలో అవతరించారు. వీరి గురించి గురుచరిత్రములో తెలిపినది అతి తక్కువ మాత్రమే. వారి అవతార వైభవం గురించి, వారి మహిమల గురించి, వారి సమకాలీనుల గురించి తెలుగువారికి, ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. భక్తుల యొక్క కోరిక తీర్చడానికా అన్నట్లుగా భీమవరం నివాసి అయిన మల్లాది గోవింద దీక్షితులు అను వారి ఇంట ఈ మధ్యనే లభ్యమయినది. ఈ గ్రంధం గురించి రచయిత మాటల్లోనే చదువుదాము.

:శ్రీ పాదుల వారి దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్న బ్రాహ్మనుడు సంస్కృతంలో రచించినాడు. దాని తెలుగు అనువాదం బాపన్నావధానుల వారి 33వ తరం వాడినయిన నా వద్ద వున్నది. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతంలో బాపన్నావధానులు గారి 33వ తరంలోనే అది వెలుగులోనికి వస్తుందని చెప్పబడినది గాని అది ఏ సమయమున ఏ విధముగా అని వివరింపబడలేదు.

ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో నేను వెళుతుండగా ఒక వృద్దుడైన యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్ధించెను. నేను 11 రూపాయిలు ఇచ్చినాను. తరువాత రెండుమూడు రోజుల్లో గాణగాపురం నుంచి శ్రీ నృశిమ్హసరస్వతులవారి ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్టులో వచ్చినది. నేను ఏ రోజునయితే వృద్ద యాచకుడికి 11 రూపాయిలు ఇచ్చినానో అదే రోజున గాణగాపురానికి సంస్తానానికి నేను 11 రూపాయిలు ఇచ్చినట్లు రశీదు కూడా అందులో జతచేయబడినది. వాస్తవమునకు నేను గాణగాపురానికి ఎంతమాత్రం డబ్బు పంపించలేదు.

శ్రీ పాదుని సంకల్పం "చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయు సమయం ఆసన్నమైనదని" నేను గ్రహించి, ముట్టుకుంటే చిరిగిపోయేలా వున్న పాత ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి, తెలుగు పాత ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడ వెళ్ళి కృష్ణా నదిలో నిమజ్జనం చేసితిని."

"ఇది అక్షర సత్యమయిన గ్రంధం. దీనిలో వ్రాయబడిన ప్రతీ అక్షరమూ శక్తివంతమయినది. సత్యమయినది. ఈ గ్రంధంలో అతిశయోక్తులు గాని, అర్ధం పర్ధం లేని వర్ణనలు గాని వుండవు."

ఇంతటి మహిమాన్వితమయిన ఈ గ్రంధ రాజాన్ని తాడేపల్లిగూడెంలో వున్న శ్రీ దత్త విశ్వరూప సమితి వారు భక్తులకి అతి తక్కువ ధరకు అందచేస్తున్నారు. ఈ పుస్తకం కావలసిన వారు పూర్తి వివరాల కొరకు 9848499411 నెంబరుకు సంప్రదించవచ్చును. లేదా sreedattasamiti@gmail.com అను ఈమెయిల్ చిరునామాకు సంప్రదించవచ్చును.

Thursday, April 1, 2010

శ్రీ పాద శ్రీ వల్లభుల అపురూప దృశ్య మాలిక

మీకు నచ్చిన చిత్రాల మీద క్లిక్ చేసినట్లయితే పెద్దగా కనిపిస్తాయి.


Sunday, March 28, 2010

సిద్దమంగళ స్తోత్రం

1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.

Monday, March 22, 2010


ఆంధ్ర దేశమందు పీఠికాపురంలో సర్వ మానవాళిని కాపాడాడానికి, సర్వ మత సారాంశం ఒక్కటే అని చాటి చెప్పడానికి సాక్షాత్తూ, అ దత్తాత్రేయుడే శ్రీ పాద శ్రీ వల్లభులుగా జన్మించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అబేధాన్ని ప్రదర్శించి సర్వ దేవతా మూర్తుల, శక్తుల ఆరాధన తనకే చెందుతుందని చాటి చెప్పిన అవతార మూర్తి శ్రీ పాద శ్రీ వల్లభులు. ఆయన మహిమలను, అవతార వైభవాన్ని నలుదెశలా చాటి చెప్పడానికి అవతరించినదే శ్రీ దత్త విశ్వ రూప సమితి. రండి.. అందరూ శ్రీ పాద శ్రీ వల్లభుల సేవలో తరిద్దాం..